ఏపీపై చాలా కుట్రలు, రేపే బయటపెడతా: శివాజీ, నెహ్రూకు మద్దతుగా ప్రచారం

1:52 pm, Sat, 6 April 19
sivaji

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయని ప్రముఖ సినీ నటుడు శివాజీ ఆరోపించారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు మద్దతుగా శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఇప్పుడు చాలా కుట్రలు జరుగుతున్నాయని శివాజీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ నాలుగు రోజుల్లో కుట్రలు మరింత పెరిగాయని వ్యాఖ్యానించారు. ఈ కుట్రలకు సంబంధించిన వివరాలను రేపు(ఆదివారం) మీడియా ముందు బయటపెడతానని తెలిపారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) పునేఠాను మార్చడంపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ను మార్చడం కంటే దారుణం ఇంకేం ఉంటుందని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోడీ కుట్రేనని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు.

జగన్‌పై దేవినేని ఘాటు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకే రారనీ, కోడి కత్తి పార్టీకి ప్రజా సమస్యలు పట్టవని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి చరిత్ర సృష్టించామని తెలిపారు.

విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా కారణంగా ఏపీలోని రైతులకు రూ.44,000 కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఉమ పేర్కొన్నారు. అసెంబ్లీకి రాని వ్యక్తులకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

చదవండి: ఆ డబ్బు ఎక్కడిది బాబూ..?: ఏపీ సీఎంను ఏకిపారేసిన రాజశేఖర్