నాలుగు పార్టీలు ఏకమై, మరో నాలుగేళ్లు పాదయాత్ర చేసినా..,: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu1
- Advertisement -

CM Chandrababu Naidu1

విజయవాడ: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం టీడీపీపై పోరాడుతున్నాయని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ఆయన  శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

- Advertisement -

రాష్ట్ర ప్రజలు తెలుగుదేశంపై చూపుతున్న అభిమానాన్ని ఓర్వలేక బీజేపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీలు  ఏకమై టీడీపీని లక్ష్యంగా చేసుకున్నాయని.. తెలుగుదేశం పార్టీపై అక్కసు పెంచుకున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వారు తమపై ఎంతగా గురి పెడితే తమకు అంత లాభమని.. వారి తిట్లే తమకు ప్రజా దీవెనలని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు ప్రజల నుండి ఎటువంటి స్పందన లేదని, ఆయన ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమని అన్నారు. జగన్‌ చిత్తశుద్ధితో పాదయాత్ర చేయట్లేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే ఆయన మరో నాలుగేళ్లు పాదయాత్ర చేసినా ఫలితం ఏమీ రాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానం తెలుగుదేశంపై ఉందని, అదే తమ నైతిక బలమని పేర్కొన్నారు. తాను ఒక్కడినే కష్టపడితే చాలదని.. పార్టీ సభ్యులంతా కష్టించి పని చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించినా.. కేంద్రం నుంచి ఒక్క బిజేపీ నేత కూడా వచ్చి ఎలాంటి సాయం అందించలేదన్నారు. రాజమహేంద్రవరంలో పవన్‌ కవాతును ప్రశంసించిన కేటీఆర్‌.. టిట్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు.  ఆ తరువాత కౌన్సిల్‌ ఎన్నికలు, ఓటర్ల నమోదు,  బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.

 

- Advertisement -