అమరావతి: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 8వేలపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ
మహమ్మారిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్-19 ప్రత్యేక చికిత్స అందించే ఆస్పత్రుల సంఖ్యను పెంచుతున్నామని జగన్ చెప్పారు. ఈ ఆస్పత్రుల్లో
మౌలిక సదుపాయాల కల్పన కోసం రానున్న 6 నెలల కాలంలో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ చికిత్స కోసం అదనంగా మరో 54
ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నామని తెలియజేశారు. కరోనా కారణంగా తీవ్ర అస్వస్ధతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. అత్యంత ఖరీదైన
రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇలా చేయాలంటూ ప్రతి రోగికీ ఒక్కో డోసుకు దాదాపు రూ.35 వేలు వరకు ఖర్చవుతుందని.. అయినా ఖర్చుకు వెనుకాడవద్దని జగన్
స్పష్టంచేశారు. విషమ పరిస్ధితిలో ఉన్న పేషెంట్లందరికీ ఈ మందులు అందుబాటులో ఉంచాలని తేల్చిచెప్పారు. కొవిడ్ పేషెంట్ల వైద్య సేవల్లో లోపాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో రానున్న 6 నెలల్లో పెద్ద
ఎత్తున స్పెషలిస్టులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.