ఆంధ్రా గీంధ్రా అనొద్దు.. మామూలు ఇచ్చేయ్.. ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు: ఓ చెక్‌పోస్టు ఉద్యోగి వీరంగం…

chandra-babu-naidu
- Advertisement -

chandra-babu-naidu

గుడిపాల: చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని నరహరిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఓ కలెక్షన్ ఏజెంట్ వీరంగమేశాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఇష్టం వచ్చినట్టు దూషించాడు. ఈ విషయం కాస్తా మంత్రి దృష్టికి వెళ్లడంతో ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

అసలేం జరిగిందంటే…

ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు జిప్సం లోడుతో వెళ్తున్న లారీని బుధవారం చెక్‌పోస్టు వద్ద రవాణా సిబ్బంది అడ్డుకున్నారు. లోడుకు సంబంధించి పూర్తి పత్రాలు అతడికి చూపించి తనని వదిలేయాలని డ్రైవర్ కోరాడు.

అయితే, మామూలు ఇవ్వకుంటే లారీని వదిలేది లేదని అతడు తేల్చి చెప్పాడు. అయితే తాను నిత్యం ఇదే రూట్‌లో తిరుగుతుంటానని, తనదీ ఆంధ్రాయేనని లారీ డ్రైవర్ అనడంతో .. సదరు కలెక్షన్ ఏజెంట్‌కి చిర్రెత్తు కొచ్చింది. ‘‘ఆంధ్రా, గీంధ్రా అని మాట్లాడొద్దు. ఇక్కడ చంద్రబాబుకే దిక్కులేదు. మామూలు ఇచ్చే ఉద్దేశం ఉంటేనే మళ్లీ ఈ రూట్‌లో రా. ఈసారికైతే పంపిస్తున్నా..’’ అంటూ లారీ డైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దీంతో లారీ డ్రైవర్ ఊరుకోకుండా.. ‘‘చంద్రబాబుకే దిక్కులేదంటావా?’’ అని తిరిగి ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయిన ఆ కలెక్షన్ ఏజెంట్‌ ఈసారి ఏకంగా బూతులు అందుకున్నాడు.

మొభైల్‌ ఫోన్‌లో రికార్డు చేసి…

అయితే లారీ డ్రైవర్ కాస్త తెలివైనవాడు.  ఈ మొత్తం సంఘటన అంతా తన మొభైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన అతడు దానిని మంత్రి అచ్చెన్నాయుడు, రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు పంపించి ఫిర్యాదు చేశాడు. విచిత్రం ఏమిటంటే.. ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడుని సదరు  కలెక్షన్ ఏజెంట్‌ తిడుతున్నప్పుడు పక్కనే రవాణాశాఖ అధికారి, సిబ్బంది కూడా ఉన్నారు.  ఎవరూ అతడిని వారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

మామూళ్ల వసూలు కోసం ప్రైవేటు వ్యక్తి…

చివరికి ఈ విషయం మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి రావడంతో ఆయన కమిషనర్, డీటీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం ఈ ఘటనపై డీఎస్పీ సుబ్బారావుకు టీడీసీ ప్రతాప్ ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎంవీఐ రవిశంకర్ నాయక్‌కు మెమో జారీ చేశారు.

పోలీసుల విచారణలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగుచూశాయి. లారీ డ్రైవర్‌‌పై విరుచుపడి, సీఎంను దూషించిన వ్యక్తి అసలు ఉద్యోగే కాదని, మామూళ్ల వసూలు కోసం సిబ్బంది నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి అని తేలింది.

- Advertisement -