భార్యాభర్తల మధ్య కరోనా చిచ్చు.. పరీక్షలు చేయించుకుంటేనే కాపురమన్న భార్య!

4:08 pm, Sun, 29 March 20

కర్నూలు: కరోనా మహమ్మారి కుటుంబ బంధాలను ఎలా నాశనం చేస్తోందో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ. తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చాడో భర్త. 

చదవండి: అందరూ ఉండీ అలా: తెలంగాణలో తొలి కరోనా పేషెంట్ మృతదేహానికి అంత్యక్రియలు ఇలా…

అతడిని చూసిన భార్య పట్టరాని ఆనందంతో ఇంట్లోకి ఆహ్వానించలేదు. కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లో అడుగుపెట్టాలని తేల్చి చెప్పింది.

‘‘ముందు పరీక్ష.. ఆ తరువాతే ఇంట్లోకి…’’

భార్య మాటలు పట్టించుకోకుండా అతడు ఇంట్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. అంతే- ఆమె చెలరేగిపోయింది. పరీక్షలు చేయించుకున్న తర్వాతే రావాలని, ఆ వైరస్ అతడిలో ఉండి, అది తనకు, తన పిల్లలకు అంటుకుంటే పరిస్థితి ఏంటని నిలదీసింది.

అయినప్పటికీ అతడు వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.అక్కడ వారిద్దరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

చదవండి: చిన్న దేశం.. వైద్య సౌకర్యాలూ అంతంతమాత్రం.. కానీ ‘కరోనా’పై గెలుపు సాధించింది!