తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న‘కరోనా’.. కొత్తగా ఏపీలో 2, తెలంగాణలో 1 పాజిటివ్ కేసు…

12:25 am, Sun, 22 March 20
corona-virus-effect-in-ap-and-telangana

అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కరోనా వైరస్ మరింత విస్తరిస్తోంది.  తాజాగా ఏపీలో  2 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తెలంగాణలోనూ 1 పాజిటివ్ కేసు నమోదైంది.

విజయవాడలో ఒకరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది.

తెలంగాణలోనూ…

ఇక తెలంగాణలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శనివారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. కూకట్‌పల్లి ఫేజ్ 2లో ఓ మహిళకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో సదరు మహిళను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చదవండి: జనతా కర్ఫ్యూ: రేపు అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయండి.. అవసరమైతే తెలంగాణ షట్‌డౌన్‌: సీఎం కేసీఆర్

బాధిత మహిళ సోదరుడు కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తుంది. తాజా కేసుతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి పెరిగినట్లయింది.

కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి రండి: సీఎం కేసీఆర్

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిపై శనివారం మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. శుక్రవారం(20న )ఒక్కరోజే 1500 మంది విదేశాల నుంచి వచ్చారని, మార్చి 1 నుంచి చూసుకుంటే.. ఇప్పటి వరకు 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారు వారంతటే వారే వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. దగ్గు, జల్బు, శ్వాస పీల్చడంలో ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి రావాలని, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేేసే చర్యల్లో భాగంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సుల రాకపోకలను నిలిపివేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

చదవండి: కరోనా భయం: ల్యాండింగ్‌కు ‘నో’.. వెనుదిరిగిన ఫ్లైట్, అందులో 90 మంది భారతీయులు!