ఏపీలో ప్రమాద ఘంటికలు.. ఒక్క రోజులోనే రెట్టింపైన కరోనా కేసులు

10:49 pm, Tue, 31 March 20
covid-19-positive-cases-reaches-to-258-in-india

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

నేడు ఒక్క రోజే ఏకంగా 17 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 44కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది.

బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

తాజాగా అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23గా ఉండగా, నేడు ఒక్కసారిగా ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.

దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.