అక్కడ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందో?

10:24 am, Fri, 10 May 19
Chandrababu Naidu Varthalu, Narasaraopet Latest News, TDP Latest News, Newsxpressonline

గుంటూరు: ఏప్రిల్ 11న ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో..చాలా చోట్ల  క్రాస్ ఓటింగ్ జరిగిందని పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్ధమవుతుంది. ఎక్కువ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి ఒక పార్టీకి ఓటు వేసిన అభ్యర్ధులు….పార్లమెంట్‌కి వేరే పార్టీకి వేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రాస్ ఓటింగ్  కొన్ని చోట్ల టీడీపీకి కలిసొస్తుండగా…మరికొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా ఉంది. అలాగే మూడు, నాలుగు స్థానాల్లో జనసేనకి అనుకూలంగా కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా నరసరావు పేట పార్లమెంట్ పరిధిలో కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది.

చదవండి: తూర్పు ఎవరిది? టీడీపీ కంచుకోటని కైవసం చేసుకుంటుందా!

అయితే ఈ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందో అని అభ్యర్డులు టెన్షన్ పడుతున్నారు. 2014లో నరసారావుపేట పార్లమెంట్ నుంచి టీడీపీ తరుపున రాయపాటి సాంబశివరావు పోటి చేసి గెలుపొందారు. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో ఉన్నారు.

క్రాస్ ఓటింగ్ ఎవరికి అనుకూలం

ఇక గత ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని పెదకూరపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు, నరసరావుపేట, మాచర్ల అసెంబ్లీల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందిన విషయం విదితమే.

గత ఎన్నికల్లో నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో అధికంగా క్రాస్‌ఓటింగ్‌ జరిగింది. దాదాపు 20 వేలు పార్లమెంట్‌కి క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఈసారి కూడా భారీగానే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సారి టీడీపీ-వైసీపీలకి పోటీగా బీజేపీ, జనసేన అభ్యర్థులు కూడా ఉన్నారు.  బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అభ్యర్థిగా కమాల్‌ పోటీ చేశారు. ఈ ఇరు పార్టీల నుంచి కూడా పార్లమెంట్‌కు క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

మరి వీరు ఎవరి ఓట్లు చీల్చారో అర్ధం కావడం లేదు. మొత్తం మీద  రాయపాటి సాంబశివరావు, లావు శ్రీ కృష్ణదేవరాయలు గెలుపు, ఓటములపై బీజేపీ, జనసేన పార్టీల ప్రభావం చూపవచ్చు. మరి క్రాస్ ఓటింగ్ ఎవరి కొంపముంచిందో తెలియాలంటే 23 వరకు ఆగాల్సిందే.

చదవండి:  వైసీపీ గెలిస్తే ఆ టీడీపీ నేతలు జంప్ అవ్వడం ఖాయమేనట…!