రంగంలోకి ధర్మాడి సత్యం బృందం.. బోటు వెలికితీతపై చిగురిస్తున్న ఆశలు!

9:11 am, Tue, 1 October 19

దేవీపట్నం: కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం బృందం చేపట్టిన బోటు వెలికితీత పనులు వేగంగా సాగుతుంటే ఆశలు చిగురిస్తున్నాయి.

నిన్న ఉదయం నుంచి ధర్మాడి సత్యం బృందం ఇనుప తాళ్లు, లంగర్లతో గోదావరిలోకి వెళ్లి ప్రమాదం జరిగిన స్థలంలో గాలిస్తోంది. ప్రభుత్వ అనుమతితో రంగంలోకి దిగిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు చెందిన బృందం ఒక పంటు, బోటుతో గోదావరిలోకి వెళ్లింది.

గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో పంటును బోటుకు కట్టి ప్రమాదస్థలికి వెళ్లింది. భారీ ఇనుప కొక్కేలు, ఇనుప తాళ్లను పంటు ద్వారా గోదావరిలోకి వదిలింది. భారీ బరువున్న ఇనుప తాళ్లను క్రేన్‌ సాయంతో పంటుకు అనుసంధానం చేసింది.

పంటు ద్వారా గోదావరి లోపలికి లంగర్లను దించి ప్రమాద ప్రదేశంలో దాదాపు రెండు వందల అడుగుల లోతుకు దింపి బోటు కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే లంగర్లకు బరువైన వస్తువు తగిలినట్టుగా తెలుస్తోంది.

అది ప్రమాదానికి గురైన వశిష్ట బోటా లేక మరేదైనా వస్తువా అనేది తెలియాల్సి ఉంది. రెండు ప్లాన్లతో సహాయక చర్యలకు దిగిన ధర్మాడి బృందం తొలి ప్లాన్‌లోనే పురోగతి సాధించడంతో బోటు బయటకు వస్తుందనే ఆశాభావం పెరుగుతోంది.

మరోవైపు.. కచ్చులూరు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అక్కడికి ఎవరినీ అనుతించడం లేదు. కనీసం మీడియాను కూడా దగ్గరికి రానివ్వడం లేదు.

సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశం నుంచి కాస్త దూరం నుంచే మీడియా కవరేజ్‌కు అనుమతించారు. పూర్తిగా బోటు బయటకు వచ్చిన తర్వాతనే మీడియాను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.

ఇటు సెల్ టవర్ సిగ్నల్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. వదంతులు వెలువడే అవకాశం ఉండటంతో.. సెల్‌ జామర్లను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

కచ్చులూరు ప్రమాదం సెప్టెంబర్‌ 15న జరిగింది. సరిగ్గా 15 రోజులు దాటిపోయింది. ప్రమాద సమయంలో 26 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మరో 40 మృతదేహాలు లభించాయి.

కానీ.. ఇంకా పదిహేను మృతదేహాలు దాకా.. లభించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు ఎంత గాలించినా.. అత్యాధునిక పరికరాలతో గోదావరి అంతా పరిశీలించినా బోటు ఆచూకీని కనిపెట్టలేకపోయారు.

రెండు ప్లాన్లతో బోటును బయటకు తీసేందుకు రంగంలోకి దర్మాడి టీం దిగింది. భారీ సరంజామాతో బోటు, పంటు ఆధారంగా బోటు వెలికితీత పనులను మొదలుపెట్టింది. బోటు కదిలినా, బయటకు వచ్చినా మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉంది.