అజ్ఞాతంలో డాక్టర్ సుధాకర్.. ఐదు రోజుల వరకు ఎవరినీ కలవకూడదని నిర్ణయం

6:42 pm, Sun, 7 June 20

విశాఖపట్టణం: హైకోర్టు ఆదేశాలతో విశాఖపట్టణం మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయిన డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మానసిక ప్రశాంతత కోసం నగరంలోని ఓ రహస్య ప్రదేశంలోకి ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది.

 తనకు మద్దతు పలికేందుకు వచ్చే వారిని ఐదు రోజుల వరకు కలవకూడదని సుధాకర్ నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితులకు చెప్పారని చెబుతున్నారు.  

మరోవైపు, సుధాకర్‌ను మానసిక ఆసుపత్రిలో ఎవరు చేర్పించారన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్వయంగా ఆయన వచ్చే ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధారాణి తెలిపారు. 

 సుధాకర్‌ను పోలీసులు కేజీహెచ్‌కి తీసుకురాగా ఓపీలో ఆయనను చూశామని,  అక్కడ ఆయన హడావిడి చేయడంతో పోలీసులే తమ వాహనంలో ఆయనను మానసిక వైద్యశాలకు పంపినట్టు   కేజీహెచ్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ సుధాకర్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఈ విషయంపైనా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.