చంద్రబాబుకు బిగ్ షాక్! పిలిచినా రాని తోట త్రిమూర్తులు, సీఎం జగన్‌తో భేటీ…?

5:50 pm, Thu, 5 September 19
chandrababu-thota-trimurtulu

తూర్పుగోదావరి: టీడీపీకి కంచుకోటగా భావించే తూర్పు గోదావరి జిల్లాలో ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ నేతలను సమన్వయ పరుచుకుంటూ చేసుకుంటూ.. టీడీపీ శ్రేణుల్లో మరింత స్థయిర్యం నింపే ఉద్దేశంతో జిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది.

జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అయిన తోట త్రిమూర్తులు.. ఆయన వర్గం చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. పార్టీ అధినేత సమీక్షకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా లేనంటూ జిల్లాలో ఆ పార్టీకి చెందిన తోట త్రిమూర్తులు తేల్చిచెప్పారు. దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు చంద్రబాబు తన తరుపున కొంతమంది ప్రతినిధులను పంపించారు.

అయినా సరే త్రిమూర్తులు తాను హాజరు కాలేననడంతో పార్టీ అధినేతే స్వయంగా ఫోన్ చేశారు. అయినా తోట త్రిమూర్తులు తన పట్టు వీడలేదు.. సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు.

నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అయితే అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన కొంత మెత్తబడ్డారు.

తాజాగా తోట త్రిమూర్తులు, ఆయన వర్గీయులు పార్టీ అధినేత జిల్లా పర్యటనలో పాల్గొనకపోవడం.. స్వయంగా పిలిచినా సమావేశానికి హాజరుకాకపోవడం చూస్తోంటే.. త్వరలోనే తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమనే అనిపిస్తోంది.

ఆయన త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరడం ఖాయమనే వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పైగా ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి జగన్‌తోనూ సమావేశమయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన సోదరుడు తోట నరసింహం రాయబారం నడుపుతున్నారని చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరడం ఇక లాంఛనమేనని జిల్లాలోని కొంతమంది టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు.

చంద్రబాబు స్వయంగా పిలిచినా…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్కడి పరిస్థితి అర్దం అయింది. జిల్లాలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు హాజరు కాకుండా వెంకటాయపాలెంలోనే ఉండిపోయారు.

దీంతో చంద్రబాబు స్వయంగా తన రాయబారులను పంపించి పిలిచారని.. అయితే పార్టీలోని కొంతమంది ముఖ్యుల వైఖరితో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, అందువల్ల సమావేశానికి తాను, తన వర్గం రాలేమంటూ చంద్రబాబు ప్రతినిధులతో తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించినట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు.

ఒకవేళ ఏవైనా అసంతృప్తులు ఉంటే.. వాటిపై తర్వాత సమీక్షించుకుందామని రాయబారానికి వచ్చిన నేతలు చెప్పినా, బుజ్జగించినా త్రిమూర్తులు మాత్రం తాను రాలేనని తేల్చి చెప్పారని వారు పేర్కొంటున్నారు.

కాకినాడ సమావేశంలో…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీలోని కాపు నేతలతో కాకినాడలో ఒక సమావేశం నిర్వహించగా అందులో తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. అసలు ఎన్నికల సమయంలో పార్టీలోని ముఖ్య నేతలు.. ప్రధానంగా లోకేశ్ కారణంగా నష్టం జరిగిందనే అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది.

ఒక వర్గానికి ఆర్దికంగా సహకారం అందించి కాపు నేతలను విస్మరించారంటూ త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత చంద్రబాబును కూడా కలిసారు. అప్పటి నుండి ఆయన రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజధాని గురించి తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండవచ్చంటూ సందేహం కూడా వ్యక్తం చేశారు.

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల ఆస్తుల ప్రస్తావన రాగా.. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి తన పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చి ఉండొచ్చని, అయితే అసలు నారాయణకు అక్కడ భూములు ఎలా వచ్చాయంటూ ఆయన ప్రశ్నించారు.

తాజాగా చంద్రబాబు జిల్లా పర్యటనలో జరిగిన ఉదంతంతో.. ఇక తోట త్రిమూర్తులు పార్టీలో కొనసాగకపోవచ్చని జిల్లా టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఇటీవల సీఎం జగన్‌‌తో భేటీ కావడం, తాజాగా చంద్రబాబు సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావటం.. ఇవన్నీ చూస్తుంటే ఆయన పార్టీ మారటం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.