ఏపీలో రీపోలింగ్‌పై నేడు నిర్ణయం

6:04 am, Fri, 12 April 19
eci

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

దీనిపై ఎన్నికల సంఘం పరిశీలకులు శుక్రవారం ఉదయం పరిశీలిస్తారని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఏపీలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని, హింసాత్మక సంఘటనల్లో ఒకరు మృతి చెందారని తెలిపారు.

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా 15 నమోదవ్వ గా.. అందులో 6 ఏపీలో అయ్యాయన్నారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో కొన్నిచోట్ల ఈవీఎంల రీప్లేస్‌మెంట్‌ చేయడానికి కొంత సమయం పట్టినట్టు చెప్పారు.

ఏపీలో 0.98 శాతం బ్యాలెట్‌ యూనిట్లను, 1.04 శాతం కంట్రోల్‌ యూనిట్లను, 1.6 శాతం వీవీ ప్యాట్లను రీప్లేస్‌ చేసినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల పరిశీలకులు పోలింగ్‌ స్టేషన్లవారీగా పరిశీలన జరిపి రీపోలింగ్‌ ఆవశ్యకతపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారని వివరించారు. దాన్నిబట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.