షాకింగ్: ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్…

ex-minister-atchannaidu-arrested-by-acb-in-esi-scam
- Advertisement -

శ్రీకాకుళం: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులు అరెస్టు చేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన అక్రమాలు అవినీతిపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.

టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది.

ఈ దర్యాప్తులో ఈఎస్ఐలో స్కామ్ జరిగినట్లు తేలింది. నకిలీ కొటేషన్లతో మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని నివాసంలో ఉండగా అచ్చెన్నాయుడిని, మరికొంతమందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రక్రియ మొత్తం ఐదు నిమిషాల్లో జరిగిపోవడం గమనార్హం. అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన గన్‌మెన్‌ను కూడా అనుమతించనట్లు సమాచారం.

అచ్చెన్నాయుడిని ఏసీబీ బృందాలు విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -