మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్.. బలవంతంగా కరోనా టెస్ట్..!

5:02 pm, Sat, 13 June 20

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరిలోని ఏలూరులో హైడ్రామా నెలకొంది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి కరోనా పరీక్ష చేయించాలని అధికారులు భావించారు.

అయితే టెస్ట్ చేయించుకునేందుకు చింతమనేని ప్రభాకర్ నిరాకరించారు. దీంతో ఆయనకు బలవంతంగా కరోనా పరీక్ష చేశారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు బయలుదేరిన చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

మార్గమధ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేసి ఏలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అచ్చెన్నాయుడిని తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్ జిల్లా దాటిన తర్వాతే చింతమనేనిని విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

అయితే అచ్చెన్నాయుడును జిల్లా దాటించిన తరువాత కూడా చింతమనేని ప్రభాకర్‌ను వదిలిపెట్టలేదు. దీంతో చింతమనేనిని కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారని ఆయన అనుచరులు భావించారు.

ఇదే సమయంలో రాత్రి పదకొండుగంటలకు పోలీసులు చింతమనేనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద చింతమనేనితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చింతమనేని అనుచరులకు అధికారులు అందజేశారు.