నకిలీ ఐపీఎస్ అరెస్ట్! సివిల్స్ సాధించలేక.. అడ్డదారిలో ఇలా…

5:43 pm, Thu, 16 May 19
Fake IPS Latest Updates News, IPS Latest News, AP Updates, Newsxpressonline

కడప: ఐపీఎస్ అధికారి కాకపోయినా నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న గురువినోద్ కుమార్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… నిందితుడి వినోద్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐపీఎస్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో గురువినోద్ నకిలీ ఐపీఎస్ గా మారాడు.

2017లో హైదరాబాద్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో గురువినోద్ శిక్షణ పొందాడని చెప్పారు. అయితే, సివిల్స్ కు ఎంపిక కాలేకపోవడంతో పక్కదారి పట్టాడని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా ఓ తప్పుడు గుర్తింపు కార్డును సృష్టించి, నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడినట్టు చెప్పారు. గురువినోద్ వివిధ కేసుల్లో జైలు పాలైనట్టు తెలిపారు. 2019లో జైలు నుంచి బయటకొచ్చిన అతనిలో ఎటువంటి మార్పు రాలేదని, మళ్లీ నేరాలకు పాల్పడటం మొదలు పెట్టాడని అన్నారు.

ఓ కోచింగ్ సెంటర్ లో సోషియాలజీ బోధిస్తున్న రిటైర్డ్ ఆర్మీ మేజర్ తో గురువినోద్ కు పరిచయం ఏర్పడినట్టు అంజనీకుమార్ చెప్పారు. ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటి నుంచి తుపాకీ సహా కొన్ని వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీంతో, గురువినోద్ పై ఆయనకు అనుమానం రావడంతో, ఎన్ఐఏ కు ఫిర్యాదు చేశారు.

 
దీంతో, గురువినోద్ గురించిన అసలు విషయం బయటపడిందని అంజనీకుమార్ వివరించారు. ఇకపోతే వినోద కుమార్ స్వస్థలం కడప జిల్లా, కాశినాయన మండలం వడ్డమాను గ్రామం. వినోద్ కుమార్ తండ్రి రిటైర్ ఆర్మీ ఆఫీసర్ అని సమాచారం.