చంద్రబాబు ముఖంలో ఆ భయం కనిపిస్తోందన్న తెలంగాణ మంత్రి తలసాని

2:10 pm, Sat, 13 April 19
Talasani Latest News, Chandrababu Latest News, AP News, Newsxpressonline

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మరోమారు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో తలసాని మాట్లాడుతూ..

ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నానన్న భయం చంద్రబాబు ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 46 వేల ఈవీఎంలు వాడిన చోట 300 ఈవీఎంలలో సమస్య రావడం చిన్న విషయమని తలసాని పేర్కొన్నారు. ఏపీలో పోలింగ్ శాతం చాలా బాగుందని అన్నారు.

ప్రచారం ముగిసిన తర్వాత నేతలు ఎక్కువగా మాట్లాడకూడదని పేర్కొన్న తలసాని ప్రచారం కోసమే పోలింగ్‌కు ముందురోజు చంద్రబాబు ఈసీని కలిశారని విమర్శించారు. పోలింగ్ రోజు కూడా ఓటు వేయాలంటూ వీడియో విడుదల చేయడం కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు.

అన్నీ నేనే కనిపెట్టానని చెప్పే చంద్రబాబు ఈవీఎంలు వద్దనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు లానే ఆయన కుమారుడు లోకేశ్ కూడా మంగళగిరిలో నాటకాలాడుతున్నారని తలసాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.