టీడీపీకి షాక్: మాజీ కేంద్రమంత్రి రాజీనామా, వైసీపీలో చేరే అవకాశం

3:40 pm, Sat, 30 March 19
TDP Latest News, YCP Latest News, AP Political Latest News, Newsxpressonline

కడప: సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సాయి ప్రతాప్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

వైసీపీలో చేరతారా?

ఈ సందర్భంగా సాయి ప్రతాప్ మాట్లాడుతూ.. కడప సమస్యల పరిష్కారానికే టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో పరిస్థితి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అమరావతి రమ్మని పిలిచి ఘోరంగా అవమానించారు. చంద్రబాబు తీరువల్ల మనోవేదనకు గురయ్యాను. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

అయితే, వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సాయి ప్రతాప్ కాంగ్రెస్ హయాంలో రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు.

కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు హాజరైన ఆయన.. తర్వాత దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సాయి ప్రతాప్.. తాజాగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డైనమిక్ లీడర్ అంటూ గతంలో ఆయన ప్రశంసించడం గమనార్హం.