బడులపై జగన్ ఫోకస్.. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం.. వచ్చే ఏడాది నుంచే!

10:56 am, Wed, 30 October 19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో సంస్కరణలపై దృష్టిసారించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని సమూలంగా మార్చేయనున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు.

2020 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభిస్తారు. 1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధిస్తారు. 2021 నుంచి 9వ తరగతి, 2022 నుంచి 10 తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నట్టు జగన్ అధికారులతో చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని, వారికి సరైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం 45 వేల స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

సిలబస్ చాలా బలోపేతంగా ఉండేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో నిర్వహించిన సమీక్షలో జగన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.