కన్నీళ్లు పెట్టుకున్న గల్లా అరుణ! చంద్రబాబుకు లేఖ, వైసీపీలో చేరికపై ఏమన్నారంటే..

- Advertisement -

టీడీపీ నేత గల్లా అరుణకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో బుధవారం తన అనుచరగణంతో ఆమె సమావేశం అయిన సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. తన  అనుచరవర్గానికి గతంలో ఎంతో చేయగలిగానని, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆమె ఆవేధనభరితురాలు అయ్యారు. అంతేకాదు, చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి తనను తప్పించమంటూ ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆమె కోరారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన గల్లా అరుణ తిరిగి వచ్చి అనుచరవర్గంతో బుధవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన కుటుంబ సభ్యులను ఎవరినైనా పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెప్పారు.  ఇప్పటికే గల్లా అరుణ తనయుడు గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే గుంటూరు ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు గల్లా అరుణ తన స్థానం నుంచి తప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తిరిగి ఆమె కుటుంబ సభ్యుల్లో ఎవరిని నిలబెడతారనే విషయంలో మాత్రం ఆమె స్పష్టతనివ్వలేదు.
అయితే చంద్రగిరి బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ అరుణ ఇటీవల పార్టీ అధినేతకు లేఖ రాయడంతో ఆమె తెలుగుదేశం పార్టీని వీడతారనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఆమె తన అనుచరవర్గంతో సమావేశమై పార్టీ మార్పు ఊహాగానాలకు బ్రేక్ వేశారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని మాత్రం గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి గల్లా అరుణ స్థానంలో టీడీపీ తరుపున ఆమె కూతురును పోటీకి నిలబెడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
- Advertisement -