ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో గ్యాస్ లీక్.. మేనేజర్ మృతి.. తప్పించుకున్న నలుగురు

- Advertisement -

నంద్యాల:జనసేన నేత, మాజీ ఎంపీ దివంగత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందిన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో నిన్న ఉదయం అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో నాలుగు బయటపడ్డారు.

ఉదయం 9 గంటల సమయంలో మేనేజర్ శ్రీనివాసరావు (50)తోపాటు మరో నలుగురు సిబ్బంది డ్రై ఐస్ తయారీ యూనిట్‌లోకి వెళ్లారు. అమ్మోనియా గ్యాస్ సరఫరా అయ్యే పైపునకు వెల్డింగ్ చేస్తున్న సమయంలో అది పగిలిపోయి ఒక్కసారిగా గ్యాస్ లీకైంది.

- Advertisement -

అది పీల్చిన మేనేజర్ శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన నలుగురు అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు గత 15 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు గ్యాస్ లీకైన ప్రదేశంలో గ్యాస్ మరింత వ్యాపించకుండా నీటిని వెదజల్లి కట్టడి చేశారు.

దీంతో రెండు గంటల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కార్మికులను, పరిసర ప్రాంత ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. గ్యాస్ లీక్ ఘటనపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు.

- Advertisement -