ఒక్క ఛాన్స్ ఇస్తే చేసి చూపిస్తా : నాగబాబు

5:23 pm, Sat, 23 March 19
Nagababu Latest News, Pavan Kalyan News, Janasena Latest News, Newsxpressonline

హైదరాబాద్: ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరడమే కాకుండా నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేస్తున్న మెగాబ్రదర్ నాగబాబు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తూ ప్రత్యర్థులకు దీటుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న భీమవరం నియోజకవర్గంలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన కోసం కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటాడని, త్వరలోనే వస్తాడని తెలిపారు. కార్యకర్తలంతా సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని, ఇతర కార్యకర్తలను కూడా సోషల్ మీడియా ద్వారా కలుపుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియాలో ఫాలోకండి

తాను గెలిస్తే నరసాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ వార్డ్ కౌన్సిలర్ గా గెలిస్తే కొంత మాత్రమే చెయ్యొచ్చని, ఎమ్మెల్యేగా గెలిస్తే మరికొంచెం ఎక్కువగా చెయ్యొచ్చని, అదే ఎంపీగా గెలిస్తే ఎంతో చెయ్యొచ్చని నాగబాబు వివరించారు.

అయితే, తాను చేయి చాచి ఎవరినీ ఏదీ అడగనని, తన స్వభావమే అంత అని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించడానికైనా సిద్ధమే కానీ, ఎవరినీ ఇది కావాలి అని అడగనని అన్నారు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ మెగాబ్రదర్ ఉద్ఘాటించారు.