తలబిరుసు చంద్రబాబు గూబగుయ్యిమంది: జీవీఎల్ సెటైర్లు

3:55 pm, Fri, 29 March 19
BJP MP GVL Narasimha Rao News, GVL Comments Chandrababu News, Newsxpressonline

అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రాజ్యాంగ సంస్థలతో తలబిరుసుగా ప్రవర్తిస్తే భంగపాటు తప్పదని చెప్పినా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

చంద్రబాబు గూబగుయ్యిమంది…

తాజాగా, ఏపీ హైకోర్టు చంద్రబాబుకు గూబ గుయ్యిమనిపించేలా తీర్పు ఇచ్చిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలపై, రాజకీయాలపైన ఉన్న అవగాహనతో ఈ విషయాన్ని తాను ముందుగానే చెప్పానన్నారు. కానీ, ఈ విషయంలో చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏమయిందని ట్విట్టర్ వేదకిగా ప్రశ్నించారు.

‘రాజ్యాంగ సంస్థలతో తలబిరుసుగా ప్రవర్తిస్తే చంద్రబాబు నాయుడు గారికి భంగపాటు తప్పదు అని మంచిమాటలు చెప్పినా పెడిచెవిన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గూబగుయ్యిమనిపించేలా తీర్పు ఇచ్చింది. రాజకీయాలపైన, రాజ్యాంగ వ్యవస్థపైన ఉన్న అవగాహనతో చెప్పా. మరి మీ 40 ఏళ్ళ అనుభవం ఏమైంది బాబు? @ncbn’ అని ట్వీట్ చేశారు.

ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే జీవీఎల్.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు.