లోకేష్ ఓటమిపై పందెం రాయుళ్ల జోరు!

7:37 am, Tue, 16 April 19
Nara-Lokesh

అమరావతి: రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపిన అసెంబ్లీ ఎన్నికలు అంతే ఉత్కంఠ మధ్య ముగిశాయి.ఎన్నికల ప్రచారం మొదలుకుని, పోలింగ్ పరిసమాప్తం అయ్యే వరకు కూడా భారీ ఎత్తున ఉత్కంఠ కొనసాగింది. రాష్ట్రంలో కీలకమైన నాయకులు, వారి వారసులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈ ఉత్కంఠ మరింత ఎక్కువైంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీ చేసిన గుంటూరు జిల్లా మంగళగిరిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దృష్టి పెట్టారు.

తొలుత విశాఖ నుంచి పోటీ చేస్తారని భావించినా రాజధానికి దగ్గరగా ఉంటుందని, తిరిగి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రిగా ఉంటూ విశాఖకు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన చంద్రబాబు తన కుమారుడికి మంగళగిరిని కేటాయించారనే ప్రచారం జరగింది. ఇక, మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుంచి కూడా ఇటు రాజకీయ వర్గాల్లోనూ విశ్లేషకుల్లోను, సాధారణ ప్రజల్లోనూ కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి పెరిగింది.

ఇక, ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత లోకేష్ వ్యవహార శైలి, ప్రసంగాల్లో ఆయన తడబడిన తీరు, మంగళగిరిని మందలగిరి అంటూ వ్యాఖ్యనించిన తర్వాత ఈ నియోజకవర్గంపై యువతలోనూ అమితమైన ఆసక్తి నెలకొంది. లోకేష్ ప్రసంగాలను యూట్యూబుల్లో పెట్టుకుని కొన్ని లక్షల మంది వీక్షించారంటేనే ఆయన ప్రసంగాల శైలి ఎలా ఉందో అర్ధమవుతుంది.

అదే సమయంలో ఆయనపై పేలిన జోకులు కూడా అంతే రేంజ్‌లో ఉన్నాయి. ఇక, వైసీపీ తరఫున ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి పోటీకి దిగారు. వాస్తవానికి లోకేష్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆళ్లను చాలా మంది తక్కువగా అంచనా వేశారు. అయితే, పోను పోను.. లోకేష్ శైలిని గమనించిన తర్వాత ఆళ్ళదే విజయమని ఓ నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లున్నాయి.

ఇక్కడ 85 శాతం పోలింగ్‌ నమోదయింది. క్షేత్ర స్థాయిలో ఓటర్‌ పల్స్‌ని పసిగట్టిన పంటర్లు మాత్రం వైఎస్సార్‌ సీపీపైనే పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేశ్‌ గెలుస్తాడు అని బెట్టింగ్‌ వేసే వారికి ఒకటికి 1.5 నుంచి రెండు రెట్లు ఇస్తామంటున్నారు. ఎలక్షన్‌ ముందు రోజు చాలా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు లోకేశ్‌కు హ్యాండ్‌ ఇచ్చారు. డబ్బులు అందగానే వారి ‘దారి’ వారు చూసుకున్నారు. దీనికి తోడు లోకేశ్‌ గెలిస్తే తాడేపల్లి మండలంలో కొండలపై ఉన్న వారి ఇళ్లను తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

వీరంతా గంపగుత్తగా ఆర్కేకు వైపు మొగ్గు చూపినట్లు తెలసుస్తోంది. అలాగే భూ సేకరణ వల్ల ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగిన రైతులు, ల్యాండ్‌ పూలింగ్‌కు భూములు ఇచ్చి నష్టపోయిన రైతులు… చేనేతలు ఇలా అందరూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ సీటును చంద్రబాబు బీసీల్లో ఇక్కడ బలంగా ఉన్న పద్మశాలీలకు ఇస్తామని తర్వాత లోకేష్‌ను రంగంలోకి దింపారు.

దీంతో తమ రాజకీయ భవిష్యత్తుపై పద్మశాలీలు ఆందోళన కూడా చెందారు. ఇక్కడ టీడీపీని ఓడించాలని వారిలో కొందరు తీర్మానాలు కూడా చేసుకున్నారు. దీనికితోడు ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించడంతో అప్పటిదాకా ఉన్న సమీకరణాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.

దీంతో పందెం రాయుళ్లు కూడా రెచ్చిపోయి మరీ ఇక్కడ పందేలు కడుతున్నారు. లోకేష్‌పై పందెం కాసేవారు రూ.లక్ష కడితే.. తాము రెండులక్షలు ఇస్తామని ముందుకు వస్తున్నారు. మొత్తంగా ఆర్కే గెలుపుపైనే ఇక్కడ పందెం రాయుళ్లలోనూ ఉత్సాహం కనిపిస్తుండడం గమనార్హం. కోసమెరుపు ఏంటంటే.. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తుండడం.