మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి: ఏపీకీ హైకోర్టు ఆదేశం

ap-high-court
- Advertisement -

high-court-of-ap

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు  మంగళవారం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగియడంతో పంచాయతీలలో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. ఈ జీవోని  సవాల్‌ చేస్తూ మాజీ సర్పంచులు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

గ్రామ పంచాయతీలకు కాలపరిమితి ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా పాలన కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

మాజీ సర్పంచ్‌ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ప్రత్యేక అధికారుల పాలనను విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 90ని కొట్టేవేసింది. దీనిపై  మంగళవారం వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏపీ, తెలంగాణల్లోని గ్రామాల్లో సర్పంచ్‌ల పాలన ఈ ఏడాది ఆగస్ట్ 1తో ముగిసింది. నాటినుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అయితే తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేత శ్రవణ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో ఇదే తరహా తీర్పును హైకోర్టు వెలువరించింది.

 

- Advertisement -