అమరావతి: ‘అన్‌లాక్-1’లో భాగంగా రేపటి నుంచి తెలంగా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఎత్తివేయనున్నారన్న ప్రచారంపై ఏపీ నోడల్ అధికారి కృష్ణబాబు స్పందించారు.
ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పోస్టులను యథావిధిగా పర్యవేక్షిస్తామన్నారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడంతో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, రైల్వేస్టేషన్లు, డొమెస్టిక్ ఎయిర్ పోర్టులలో మరికొన్ని రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు.
ఏపీకి వచ్చేవారందరూ కచ్చితంగా స్పందన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందేనన్నారు. చెక్ పాయింట్ల వద్ద అందరి వివరాలను నమోదు చేసుకుని ఆరోగ్యశాఖ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తామన్నారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా వారం రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరని స్పష్టం చేశారు.