కేంద్రమంత్రితో అఖిల ప్రియ భేటీ.. బీజేపీలోకి జంపేనా?

8:11 am, Sun, 22 September 19

విజయవాడ: సీమ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడా వారసత్వాన్ని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కొనసాగిస్తున్నారు. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు తన తండ్రి భూమా నాగిరెడ్డికి అఖిలప్రియ అండగా నిలిచారు. ఆ తర్వాత నాగిరెడ్డి మరణంతో భూమా వారసులకు పెద్ద దిక్కు లేకుండా పోయింది.

అదే సమయంలో అఖిలప్రియకు మంత్రి పదవి వరించింది. ప్రస్తుతం మంత్రి పదవి ఇచ్చిన పార్టీ పవర్‌లో లేదు. దీంతో అఖిల ప్రియ రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి వరకు వైసీపీ వైపు చూస్తున్నారంటూ వార్తలు వచ్చినా.. ఇటీవల ఏపీలో ఎదురవుతున్న సవాళ్లతో వైసీపీపై సాఫ్ట్ కార్నర్‌ను అఖిల చూపడం లేదు.

తొలుత వైసీపీలో చేరేందుకు అఖిల తన ప్రయత్నాలు తాను చేసినా అవి ఫలించలేదని సమాచారం. దీంతో టీడీపీలోనే ఉండిపోయారు. ఇటీవల మాజీ స్పీకర్ కోడెల మరణం తర్వాత వైసీపీ ప్రభుత్వంపై అఖిల ప్రియ మండిపడ్డారు. ప్రభుత్వ తీరే కోడెల ఆత్మహత్యకు దారితీసిందని ఆరోపించారు.

ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి…

తాజాగా ఆమె కేంద్ర మంత్రిని కలవడం టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. శనివారం ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి హైదరాబాద్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు మాట్లాడారు. అయితే తాము సమస్యలను వివరించేందుకు మంత్రిని కలిశామని అన్నారు.

ముఖ్యంగా మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య, ఆయనపై ప్రభుత్వం పెట్టిన కేసుల విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గల్లా జయదేవ్ తెలిపారు. మరోవైపు.. కర్నూలులో రాజకీయ దాడులు చేస్తున్నారని.. ఫ్యాక్షన్ గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు అఖిల ప్రియ.

ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా బయటికి చెప్తున్నా.. లోపల మాత్రం వేరే జరిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే భూమా కుటుంబ సభ్యులు కొంత మంది టీడీపీకి గుడ్ బై చెప్పి.. కమలం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అఖిల ప్రియ కూడా బీజేపీ గూటికి చేరేందుకు.. కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక రాయలసీమపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడం.. ఇప్పటికే జేసీ, పరిటాల కుటుంబాలను కూడా కమలం గూటికి రావాలంటూ కమలనాథులు కొందరు ఆహ్వానం పలికినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఒకవేళ భూమా అఖిల ప్రియ కూడా సైకిల్ దిగి.. కమలం గూటికి చేరితే.. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడం ఖాయం. మరి నిజంగా సమస్యల ఫిర్యాదు కోసమే కిషన్ రెడ్డిని కలిశారా?.. లేక పార్టీ మార్పుకేనా? అన్నది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.