టీడీపీ అభ్యర్థి పుట్టా నివాసంలో ఐటీ దాడులు: సీఎం రమేష్ నిరసన, ఉద్రిక్తత

10:58 am, Thu, 4 April 19
CM Ramesh Latest News, TDP Latest News, IT Raids News, Newsxpressonline

కడప: సార్వత్రిక ఎన్నికల వేళ మైదుకూరు టీడీపీ అభ్యర్థి, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో బుధవారం ఐటీ సోదాలు జరగడం కలకలం రేపింది. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖకు చెందిన రెండు బృందాలు బుధవారం రాత్రి సుమారు 2గంటలపాటు సోదారులు నిర్వహించాయి.

అయితే, ఆ సమయంలో పుట్టా సుధాకర్ ఇంట్లో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారంలో ఉండటంతో ఆయన కుటుంబసభ్యుల సమక్షంలో అధికారులు తనిఖీ చేశారు. కడప కేంద్రం నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఈ సోదాల్లో అధికారులు ఏవైనా వస్తువులు, నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, ఐటీ అధికారులు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

సీఎం రమేష్ నిరసన

ఐటి అధికారులు పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో సోదాలు ముగించుకుని వెళ్లే సమయానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్కడికి చేరుకున్నారు. పుట్టా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు సోదాలు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు పంపించారు సోదాల్లో ఏం దొరికిందో మీడియాకు చెప్పండంటూ నిలదీశారు.

కాగా, పుట్టా నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఐటీ అధికారుల ముందు నిరసన చేపట్టారు. ఐటీ దాడులు రాజకీయ కుట్రేనంటూ విమర్శలు చేశారు. జగన్, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులను కావాలనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తోందని సీఎం రమేశ్‌ ఆరోపించారు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నివాసంపై ఐటీ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని నరసరావుపేట ఎన్నికల ప్రచారంలో అన్నారు.

చదవండి: ఎన్నికల వేల టీడీపీకి మరో బిగ్ షాక్! వైసీపీలో చేరిన మాజీ ఎంపీ !