టీడీపీ సర్కారుపై నమ్మకం లేదు, సీబీఐతో విచారించాలి: వివేకా హత్యపై వైఎస్ జగన్

11:51 am, Sat, 16 March 19
Jaganmohan Reddy Demands CBI Probe Into Uncle's Murder, Newsxpressonline

కడప: తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ లేదా థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయం జరగదని అన్నారు. పులివెందులలో శుక్రవారం సాయంత్రం వివేకా మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సంఘటనను చూసి రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళనకు దిగకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడైన వైఎస్‌ వివేకానందరెడ్డిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమని జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ హత్య కోణమేనని అభిప్రాయపడ్డారు. హత్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

వివేకానందరెడ్డే స్వయంగా ఒక లేఖ రాసి డ్రైవరు పేరును ప్రస్తావించినట్లు పేర్కొనడం నమ్మశక్యంగా లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే తమ కుటుంబంపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని జగన్ తెలిపారు.

ఇది ఒక్కరు చేసిన పనికాదు..

‘మృదు స్వభావిగా గుర్తింపు పొందిన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా ఇంట్లో చొరబడి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. వయస్సు రీత్యా చూసినా, వ్యక్తిత్వపరంగా చూసినా ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు. దర్యాప్తు దారుణంగా, అధ్వానంగా ఉంది. చనిపోతూ లెటర్‌ రాశారా? డ్రైవర్‌ పేరు చెప్పి లెటర్‌ను సృష్టించారా? తలమీద ఐదుసార్లు గొడ్డలితో నరికారు.

చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి బాత్రూంలో పడేసి రక్తం కక్కుకుని చనిపోయినట్లు చిత్రీకరించారు. కానీ, బెడ్‌రూం నుంచి బాత్రూం వరకు ఎత్తుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కరు చేసిన పని కాదు. కిందపడి స్పృహ తప్పి పడిపోయి చనిపోయారని చెబుతున్నప్పుడు లెటర్‌ ఎలా రాస్తారు? చంపిన వారే లెటర్‌ రాయించారా? డ్రైవర్‌పై నెపం నెట్టడం కోసం లెటర్‌ రాశారా?’ అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

చంద్రబాబు హయాంలోనే తాత, చిన్నాన్నల హత్య

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తన తాత, చిన్నాన్నలు హత్యకు గురయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాలపై వైపు వెళ్లకుండా తన తండ్రిని కడపకే పరిమితం చేయాలని తమ తాత(రాజారెడ్డి)ని చంపారని అన్నారు. మొదటగా తాతను టార్గెట్ చేసి హతమార్చిన తర్వాత వారే తన తండ్రిని హత్య చేశారని జగన్ ఆరోపించారు. ఆ విషయంలో ఇప్పటికీ అనుమానాలున్నాయన్నారు.

అప్పట్లో విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణ అని చెప్పారు. తాను తలచుకుంటే అసెంబ్లీకి రాలేవు అని సెప్టెంబర్ 1న అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు సవాల్ చేశారని జగన్ చెప్పారు. మీరు మళ్లీ అసెంబ్లీకి ఎలా వస్తారని చంద్రబాబు బెదిరించిన మరునాడే.. సెప్టెంబర్ 2న తన తండ్రిని చనిపోయారని జగన్ అన్నారు.

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలోనే తనపై కత్తితో దాడి జరిగిందని, తన చిన్నాన్న హత్యకు గురయ్యారని చెప్పారు. అందుకే తాను సీబీఐ విచారణ కోరుతున్నట్లు జగన్ స్పష్టం చేశారు.