ముఖ్యమంత్రి హోదాలో.. వైఎస్ జగన్ చేసిన అతి పెద్ద తప్పు..!

3:25 pm, Sat, 1 June 19
CM YS Jagan News, YCP Latest News, AP Political News, Newsxpressonline

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా మే 30న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణ స్వీకారం రోజునే ఆయన మీడియాపై చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైయింది. ఎల్లో మీడియాగా పేర్కొంటూ జగన్ ఓ మూడు చానళ్ల పేర్లు చెప్పి.. వీటి అంతు చూస్తాం అన్నట్టు ఉద్రేకంగా మాట్లాడారాయన. 

నిజంగా ఇలాంటి వ్యాఖ్య ఓ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజు రావడం దురదృష్టకరం.  జగన్ మోహన్ రెడ్డికి కచ్చితంగా బాధ ఉంటుంది. ఎందుకంటే అ మూడు చానళ్లు చంద్రబాబు, టీడీపీ కొమ్ముకాశాయి మరి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

చదవండి: సీఎంగా వైఎస్ జగన్ తోలిరోజు ఎలా సాగిందో చూడండి!

ఆ మూడు చానళ్లు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో మీడియా అనూ’కుల’గా వ్యవస్థగా మారిపొయిందన్న సంగతి నిర్వివాదాంశం.  ఎవరి వర్గానికి వారు భజన చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం శాయశక్తులా చేస్తున్నారు. దీనికి ఎవరూ అతీతం కాదు.

‘సాక్షి’ చేసింది కూడా అదే కదా…

ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డి ‘సాక్షి’ మీడియాని తీసుకుందాం. చంద్రబాబు అమలు చేసిన ఒక్క అభివృద్ధి పథకం గురించైనా తమ మీడియాలో చెప్పిందా?.. ఎంతసేపూ చంద్రబాబు, టీడీపీలపై నెగిటివ్ ప్రచారమే పరమావధిగా పెట్టుకుంది. చంద్రబాబు అనుకూల మీడియా కూడా కేవలం చంద్రబాబుకు, ఆయన పార్టీకి భజన చేయడమే లక్ష్యంగా పెట్టుంది.

అయితే ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి తప్పు ఏమిటంటే.. మీడియాని టార్గెట్ చేయడం. ఈ ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించారు. అయితే మీడియా తనకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఒక్క అనుకూల కథనం కూడా  ప్రచురించకపోయినా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.. అది వేరే సంగతి!

చదవండి: జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వణికిపోతున్న మాజీ సీఎం చంద్రబాబు!

మరి అసెంబ్లీ ఎన్నికల్లో తన ఘన విజయంతో జగన్ తెలుసుకున్నది ఏమిటి? ఏ నాయకుడైనా ఒకరికి చెడు చేయాలని చూసినా.. మరొకరిని తొక్కేయాలని ప్రయత్నించినా .. ప్రజలు గమస్తుంటారని, వారు సరైన సమయంలో తమ ఓటుతో అలాంటి నాయకుడికి బుద్ధి చెబుతారని.. ఈ విషయమే జగన్‌కి ఇంకా అర్ధం కాకపోవడం బాధకరం.

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆవేశంలో అనాలోచితంగా ప్రమాణ స్వీకార వేదిక నుంచి మీడియాపై చేసిన ప్రకటన వల్ల ఏమైంది? ఏపీ సీఎం జగన్ ఒక వర్గం మీడియా మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకోబోతున్నాడనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది.

ఇది జగన్ కి ఏ మాత్రం కూడా మేలు చేయదు. ఎందుకంటే మీడియా, రాజకీయ పార్టీలు, నాయకులు కంటే ప్రజలు, ఓటర్లు తెలివైన వారు.  దానికి నిదర్శనం కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే. జగన్ మోహన్ రెడ్డిని ఒక వర్గం మీడియా తొక్కేస్తోందనే విషయం సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యింది. దాని ద్వారా జగన్‌కి సింపతీ పెరిగింది.

చదవండి: జగన్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తోన్న ఆ పిల్లాడు ఎవరు?

అంతేకాదు.. చంద్రబాబు చేసిన దారుణమైన పొరపాట్లని కూడా ఆ మీడియా ఎన్నడూ ఎత్తి చూపలేదు.  మీడియా ఈ రకమైన ధోరణి కూడా చంద్రబాబుకి అతి పెద్ద నష్టం కలిగించింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా తన తప్పులని ఎత్తిచూపే మీడియా నోరు నొక్కేస్తామని అన్యపదేశంగా చెబుతున్నారు. ఇది కూడా కచ్చితంగా తప్పే.

ఇలా కాకుండా “చూశారా.. నన్ను ఎంత కిందకి తొక్కేయాలని చూసింది మీడియా. కానీ ప్రజలు నా పక్షాన నిలబడ్డారు. ఇప్పటికైనా మీడియా కళ్ళు తెరవాలి. నిజానిజాలని ప్రజలకు తెలియజేసి నిబద్దతని చాటాలి..” అని ఆయన గనుక పిలుపునిచ్చి ఉంటే.. ప్రజలు ఇంకా హర్షించేవారు. జగన్ మోహన్ రెడ్డి హీరోయిజం ఇంకా పెరిగి ఉండేది.

చదవండి:  ఆసక్తికరం: నాడు 151 మంది మద్దత్తు ఇస్తే కాదన్నారు.. నేడు అదే 151 మందితో…