సున్నా విలువ తెలియని సన్నాసుల్లారా… వైసీపీ నేతలకు నాగబాబు ఘాటు కౌంటర్

7:15 pm, Sat, 18 January 20

అమరావతి: వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సున్నా విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని నాగబాబు అన్నారు. సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ ఇంతగా అభివృద్ధి చెందడానికి సున్నానే కారణమన్న విషయాన్ని చదువుకున్న సన్నాసులు గుర్తించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంబటి, అవంతి, పేర్ని నానిపైనా నాగబాబు సెటైర్లు వేశారు. వైసీపీ నేతల వల్ల ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ లేని లోటు తీరిందంటూ నాగబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

జనసేన, వైసీపీ మధ్య ఇటీవల ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గుండు సున్నా దేనితో కలిసినా, విడిపోయినా ఫలితం సున్నాయేనని, జీరోను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరిగేదదేనని ఎద్దేవా చేశారు. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుందన్నారు. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారని, దెబ్బతింటుంటారని అన్నారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలని విజయసాయి ట్వీట్ చేశారు.

యాక్టర్ నిమిత్తమాత్రుడని, నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీయేనంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. కమ్మూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనేని అన్నారు. ఆ ట్వీట్‌కు నాగబాబు ఘాటుగా రిప్లై ఇచ్చారు.