జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం!

10:34 am, Mon, 8 April 19
spy reddy health condition

హైదరాబాద్: నంద్యాల లోక్‌ సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత వారం ఎన్నికల ప్రచార సమయంలో అస్వస్థతకు గురైన ఆయనకు నంద్యాలలో ప్రథమచికిత్స చేయించి, హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే.

ఆయనకు ఐదు రోజులుగా చికిత్స జరుగుతున్నా కోలుకోలేదు. ప్రస్తుతం ఎస్పీవై రెడ్డికి బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది.

2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి, ఆపై టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ను నిరాకరించడంతో, జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. చిన్న కుమార్తెను, పెద్ద అల్లుడిని బనగానపల్లి, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిపారు.