చంద్రబాబు, జగన్‌‌లకు షాక్.. బీజేపీతో జనసేన దోస్తీ, 2024లో అధికారమే లక్ష్యంగా…

bjp-janasena-alliance-in-ap
- Advertisement -

విజయవాడ: వచ్చే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో బీజేపీ నేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రజానీకం తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, కేంద్రంలో బలమైన మోడీ సర్కారు ఉండడం.. అలాగే బీజేపీ, జనసేనల భావజాలం కూడా ఒక్కటే కావడం వల్ల ఆ పార్టీతో కలిసి ముందుకుసాగాలని తాము భావిస్తున్నామని, అంతేకాకుండా.. రాష్ట్రానికి బీజేపీ అవసరం చాలా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.

ప్రజాభీష్టం మేరకే పొత్తు…

సామాజిక న్యాయం బీజేపీ, జనసేనలతోనే సాధ్యమవుతుందని అన్న పవన్.. ప్రజాభీష్టం మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికలతోపాటు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీచేస్తామని, ఈ నేపథ్యంలో 2024లో రాష్ట్రంలో బీజేపీ-జనసేన సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెప్పారు.

బీజేపీ నేతలతో కీలక సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్.. తమ పార్టీకి బీజేపీతో పొత్తు కుదిరిందని చెబుతూ, ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం ఇకమీదట తాము బీజేపీతో కలిసి సంయుక్తంగా పోరాడతామని తెలిపారు.

2014 ఎన్నికల తరువాత బీజేపీతో ఎందుకు గ్యాప్ వచ్చిందో ఆ పార్టీ నాయకత్వానికి తాము వివరించామని చెప్పిన పవన్ ఇకమీదట ఇరు పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. బీజేపీకి అవసరమున్న ప్రతిచోటా తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని జనసేనాని స్పష్టం చేశారు.

రైతులను నిండా ముంచేశారు…

రాజధాని అమరావతి విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసీపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నిండా ముంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని తాను ఆనాడే చెప్పానని ఆయన అన్నారు.

మరోవైపు ప్రతిపక్ష అధినేత చంద్రబాబుపైనా జనసేనాని విమర్శలు కురిపించారు.  రాజధాని విషయంలో అమరావతి రైతులకు భరోసా ఇవ్వడంలో టీడీపీ విఫలమైందన్నారు. చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. 

- Advertisement -