జగన్ వందరోజుల పాలనపై పవన్ పార్టీ సంచలన నివేదిక

1:16 pm, Sat, 14 September 19

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 100 రోజుల పాలనపై పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను పవన్ విడుదల చేశారు.

‘పారదర్శకత, దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజుల పాలన’ పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ పాలనపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు.

పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయన్నారు. ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం చెప్పినా వినకుండా పీపీఏలు రద్దు చేసి గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రజారోగ్యం పడకేసిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు. అందరినీ బెదిరిస్తుంటే పెట్టుబడులు ఎవరు పెడతారని పవన్ ప్రశ్నించారు.

రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని జనసేనాని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలుంటే సరిచేయాలని సూచించారు.

టీడీపీని జన్మభూమి కమిటీలు దెబ్బతీసినట్టే వైసీపీని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుందని పవన్ హెచ్చరించారు. వైసీపీ కేడర్‌ కోసమే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు.

ఏపీ రాజధాని అమరావతేనని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ తీసుకురావాలని పవన్ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు మాటలు మార్చడం వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు.

ఓటమి వల్ల జనసేన పార్టీ బలహీనపడలేదని చెప్పారు. జగన్ పాలన ప్రణాళికాబద్దంగా లేదని పవన్ విమర్శించారు. మూడున్నర నెలల్లోనే జగన్ నిర్ణయాలు ప్రజల్లో ఆందోళన నింపాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాది వరకు మాట్లాడే అవకాశం రాదని అనుకున్నామని, కానీ వంద రోజుల్లోనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను పవన్ ప్రశంసించారు. నవరత్నాలు జనరంజకమైనవే అని అంగీకరించారు.

అయితే పాలన మాత్రం జన విరుద్ధంగా ఉందని పెదవి విరిచారు. టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇసుక మాఫియనే అని పవన్ పునరుద్ఘాటించారు.