‘‘ఆ మంత్రి నిద్రపోతున్నారా? మీరు కాదంటే.. మేం ఆపేస్తాం..’’: పవన్ కళ్యాణ్

pawan-kalyan-hathibelagal-tour
- Advertisement -

pawan-kalyan-hathibelagal-tour

కర్నూలు:  జిల్లాలోని హత్తిబెళగల్‌ క్వారీ పేలుడు జరిగిన ప్రాంతాన్ని సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు.  స్థానికుల్ని అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఆయన ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పేలుడు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. అనంతరం పేలుడు ఘటనపై మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ పనితీరుపై పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -
‘‘ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోంది. గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోయినా అమరావతిలో ఉండే సీఎం చంద్రబాబుకు తెలుస్తుందట. మరి అక్రమ మైనింగ్ గురించి ఆయనకు తెలియదా? రాష్ట్రంలో అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు? నిద్రపోతున్నారా? అక్రమ క్వారీలతో ప్రాణనష్టం జరిగే వరకు మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ జనసేనాని ప్రశ్నించారు.
ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానికులు తనతో చెప్పారని, ఈ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నేతల్ని సమర్థించి ప్రజా సమస్యల్ని విస్మరించకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ‘‘హత్తి బెళగల్ వంటి పేలుడు ఘటన ఇకపై రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదు. వెంటనే అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకొని.. ప్రమాదాలకు కారణమయ్యే క్వారీలను సీజ్ చేయాలి. ప్రభుత్వం చేయని పక్షంలో జనసేన కార్యకర్తలే అక్రమ క్వారీలను మూసివేస్తారు..’’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు పవన్ వెళ్లిన సమయంలో అక్కడికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకున్నారు. ఫ్యాన్స్ మొత్తం ఒక్కసారిగా ఆయన కారును చుట్టుముట్టడంతో ఇక కారును ముందుకు కదిలే వీలులేకుండా పోయింది.  దీంతో పవన్ కారు దిగి..  ఓ ఐదు నిమిషాలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ్నించే వెనుదిరిగారు.
- Advertisement -