నారా లోకేష్‌పై పోటీ, చివరి నిమిషంలో జనసేన ట్విస్ట్.. కారణాలివే!

- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో జనసేన ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారింది. నామినేషన్ దాఖలుకు చివరి రోజున జనసేన.. మంగళగిరి నుంచి పోటీ చేయాలని అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.

పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో కూడా జనసేన తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జనసేన తరపున చల్లపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేయనున్నారు. అయితే, మంగళగిరి స్థానం నుంచి సీపీఐ తరపున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్ పేరును జనసేన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

అభ్యర్థికి అర్ధరాత్రి బీ ఫాం అందజేత..

ఆదివారం అర్ధరాత్రి శ్రీనివాస్‌కు జనసేన పార్టీ బీ ఫారాన్ని అందజేసింది. దీంతో శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, లోకేష్ బరిలో దిగిన మంగళగిరిలో జనసేన పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలపలేదంటూ ఇంతకుముందు వైసీపీ నేతలు విమర్శలు చేయడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. మంగళగిరిలో జనసేన పార్టీ పెట్టకపోవడం టీడీపీతో లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమంటూ ఆరోపించారు.

అయితే, తాజాగా తీసుకున్న జనసేన నిర్ణయంపై సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. దీంతో జనసేన అధినేతతో చర్చలు జరిపిన ఆ పార్టీ నేతలు సర్దుబాటు చేసుకున్నారు.

కాగా, ఇప్పటికే మంగళగిరి స్థానంలో టీడీపీ తరపున నారా లోకేష్, వైసీపీ తరపున ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాలతోపాటు రెండు పార్లమెంటు స్థానాలను సీపీఐకి కేటాయించింది.

 

- Advertisement -