ఎన్నికల్లో డబ్బులు పంచలేదు కానీ.. మా కార్యకర్తల అవసరాలు తీర్చాను: నాగబాబు

8:57 am, Wed, 1 May 19
nagababu comments on zero money politics

హైదరాబాద్: ఎన్నికల్లో ఓటర్లకి డబ్బులు పంచడంపై నరసాపురం జనసేన అభ్యర్ధి నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన సొంత యూట్యూబ్ చానల్ ‘నా చానల్ నా ఇష్టం’లో జీరో మనీ పాలిటిక్స్ గురించి చెప్పారు.

ఎన్నికల్లో డబ్బులు పంచకూడదు అంటే…ఓటర్లకి ఇవ్వకూడదని అర్ధమని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తను ఓటర్లకి డబ్బులు ఇవలేదు… కానీ కార్యకర్తల అవసరాలు తీర్చానని అన్నారు. వారికి ఆహారం అందించడం, రాకపోకలకి సంబంధించి కార్యకర్తల బైకుల్లో పెట్రోలు వంటి వాటికి మాత్రం ఖర్చు పెట్టినట్టు తెలిపారు.

నియమావళి ప్రకారమే ఖర్చు కూడా…

అసలు ఎన్నికల్లో డబ్బులు పంచకూడదని తమ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారని చెప్పారు. అయితే ఎంపీలకు కొంత డబ్బు ఇస్తారని, వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుందని, తమకు ఇచ్చిన సొమ్మును ఖర్చుపెట్టకపోవడం జీరో మనీ పాలిటిక్స్ కిందికి రాదన్నారు. ఇక ఎన్నికల నియమావళి ప్రకారం ఎంత ఖర్చు చేయాలో అదంతా తమతో తిరిగిన కార్యకర్తలకే ఖర్చు చేసినట్టు చెప్పారు.

కాగా, ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపున నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక నాగబాబు ప్రత్యర్ధులుగా టీడీపీ నుంచి వేటుకూరి శివరామరాజు, వైసీపీ నుంచి కనుమూరి రఘురామకృష్ణంరాజులు పోటీ చేశారు. మే 23న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి.