సామాన్యులతో కలిసి.. పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రైలు యాత్ర…

janasena-pawan
- Advertisement -

Pawan Kalyan Rail Yatra

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రలో భాగంగా పవన్ విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వరకు సామాన్య ప్రజలతో కలిసి రైలులో ప్రయాణించనున్నారు.

- Advertisement -

ఈ రైలు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై సాయంత్రం 5.20 నిమిషాల వరకు కొనసాగుతుంది.  జాతిపిత మహాత్మగాంధీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ రైలు యాత్రకు శ్రీకారం చుట్టారని… రైలులో ప్రయాణిస్తూ అసంఘటిత కార్మికులతోనూ,  ప్రయాణికులతోనూ పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారని జనసేన పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు.

మరోవైపు ఈ రైలు యాత్ర సందర్భంగా జనసేన పార్టీ తమ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేసింది.  ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్లాట్ ఫాం టిక్కెట్ కొనుక్కుని లోపలికి రావాలని, రైలులో ప్రయాణించే వారు తప్పనిసరిగా టిక్కెట్ తీసుకోవాలని… అలాగే రైలులోని ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని, క్రమశిక్షణకు మారుపేరుగా జనసేన సైనికులు, అభిమానులు నడుచుకోవాలని సూచించారు.

కార్మికులు, రైతులతో పవన్ భేటీ…

జన్మభూమి ఎక్స్ ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్.. మొదటగా విజయవాడలో రైల్వే కార్మికులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నూజివీడు రైల్వేస్టేషన్లో మామిడి రైతులతో సమావేశం అయి.. అక్కడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ అడిగి తెలుసుకోనున్నారు.

అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో కూడా జనసేనాని ప్రజలతో సమావేశం కానున్నారు. తరువాత తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరంలలో పవన్ కళ్యాణ్ ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటారు. అలా సాయంత్రం 5.20 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ రైలు యాత్ర కొనసాగనుంది.

ఆ తర్వాత తుని చేరుకుని.. అక్కడ జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.  జనసేనాని రైలు యాత్రకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ట్విట్  ద్వారా  తెలియజేసింది.


 

 

- Advertisement -