అరకులో జనసేనాని! ‘ముఖాముఖి’కి వర్షం దెబ్బ.. రిసార్టులో విశ్రాంతి, రేపటి నుంచి జనపోరాట యాత్ర షురూ!

- Advertisement -
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రెండురోజులుగా అరకులోయలోని ఓ రిసార్టులో విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం రాత్రే అరకులోయ చేరుకున్న ఆయన అక్కడి ఉషోదయ రిసార్టులో బస చేశారు. పవన్‌కల్యాణ్‌ అరకులో ఉన్నారని తెలుసుకున్న కొంతమంది ఆయనకు గిరిజన సమస్యలు వివరించేందుకు సోమవారం పాడేరు నుంచి అరకులోయ వెళ్లారు. రిసార్ట్‌లోనే ఆయనతో ముఖాముఖి నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం రావడంతో ఈ కార్యక్రమం రద్దయ్యింది.
పార్టీ వర్గాల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ బుధవారం ఆయన అరకులోయలో జనపోరాట యాత్ర ప్రారంభించి, అక్కడ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పాడేరు వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ కవాతు నిర్వహిస్తారు. అదేరోజు ఘాట్‌ రోడ్డు మీదుగా కిందికి దిగి మాడుగులలోనూ యాత్ర చేపడతారు.
7వ తేదీన నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలిలో యాత్ర నిర్వహిస్తారు. 8వ తేదీన చోడవరం, అనకాపల్లి, పెందుర్తిల్లో పర్యటిస్తారు. ఇది పూర్తయిన తరువాత విశాఖ నగర పర్యటన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏ రోజు ఎక్కడ బస చేస్తారనే విషయాలు మాత్రం ఆ పార్టీ వర్గాలు వెల్లడించలేదు. అంతేకాదు, జనసేనాని ఈ పర్యటన షెడ్యూల్‌‌లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అరకులోయలో జనసేనాని ఉన్నారనే విషయం తెలిసి సోమవారం ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పవన్ దర్శనభాగ్యం కోసం వారు ఎదురుచూశారు.  పాడేరు. అరకులోయ ప్రాంతాలకు చెందిన అభిమానులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.  వర్షం తగ్గిన తరువాత అభిమానులు వేచి ఉన్నారని తెలుసుకున్న జనసేనాని సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బయటికి వచ్చారు. తాను బస చేసిన రిసార్ట్స్‌ మెయిన్‌ గేటు వద్ద వేచివున్న అభిమానుల దగ్గరకు వచ్చారు. వారికి అభివాదం చేసి.. బాగున్నారా అని పలుకరించారు. కొంతమంది పర్యాటకులు ఆయనతో సెల్ఫీలు దిగారు. వారితో ముచ్చటించిన తరువాత పవన్ లోపలికి వెళ్లిపోయారు.
- Advertisement -