చంద్రబాబుతో పెట్టుకుంటే ఏపీలో తిరుగుబాటే.. జేసీ వార్నింగ్!

- Advertisement -

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబుతో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుబాటు తప్పదని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడును టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై జేసీ స్పందించారు. ఇవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కక్ష సాధింపు చర్యలేనని ఆరోపించారు.

- Advertisement -

రాష్ట్రంలో పాలన ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్టు సాగుతోందని విమర్శించారు. తాను టీడీపీని వీడి, వైసీపీలో చేరేది లేదని స్పష్టంచేశారు. తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదని, అయినా దేనికైనా సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డికి అల్లాపై, శ్రీశైలం మల్లన్నపై భక్తిగానీ, నమ్మకంగానీ లేవని, తిరుపతి వెంకన్నపై అసలే లేవని, యేసును కూడా నమ్మడని.. అహం ఎక్కువ అని మండిపడ్డారు. దేవుడి కంటే కూడా జగన్‌కు.. నరేంద్రమోదీ అంటే ఎక్కువ భయమంటూ ఎద్దేవా చేశారు.

ఏరికోరి తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మాటలే వినడం లేదని, వారి నడుం విరగగొట్టేశారని ధ్వజమెత్తారు. చీఫ్ సెక్రటరీలకు కూడా ఎక్కడ సంతకాలు పెట్టాలో ఆయనే చెప్తున్నారని విమర్శించారు.

‘తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి పద్ధతి లేదు. దేశంలో ఇలాంటి సీఎం గతంలో లేడు… రాబోయే రోజుల్లో కూడా రాబోడు’ అని నిప్పులు చెరిగారు.

తమ కంపెనీలో 30-40 ఏళ్లుగా పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు చాలామంది ఉన్నారని, లాక్‌డౌన్ కారణంగా వారికి ఎలాంటి ఇబ్బందులూ రాకూడదని పూర్తి జీతాలు చెల్లిస్తున్నానని జేసీ వెల్లడించారు.

- Advertisement -