ఏపీలో రెడ్లు అందరూ జగన వైపే! టీడీపీ గెలిస్తే ఆ ఒక్కటే కారణం! జేసీ హాట్ కామెంట్స్!

6:39 am, Mon, 29 April 19
jc

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 99శాతం మంది రెడ్డి సామాజికవర్గం వారు వైసీపీకే ఓటు వేశారని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అంచనా వేశారు. అయినా సరే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జేసీ ధీమా వ్యక్తం చేశారు. తనకు కూడా కులాభిమానం ఉందని, ఈసారి ఎన్నికలు పూర్తిగా కులం పేరు మీదే జరిగాయని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

జగన్ కంటే చంద్రబాబు రైతులకు మేలు చేస్తున్నారన్న కారణంతోనే తాను మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని ఎక్కువ మంది అంచనాలు వేస్తున్నా.. జేసీ మాత్రం టీడీపీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకవేళ టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం అది పసుపు కుంకుమ చలవేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా, అందుకు కరెక్టుగా ఐదు రోజుల ముందు పసుపు కుంకుమ చెక్కులు మహిళలకు అందాయని, అవే పనిచేశాయన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు 120 పథకాలు ప్రవేశ పెట్టినా, అవేవీ పనిచేయలేదని, చివరి నిమిషంలో తీసుకొచ్చిన పసుపు కుంకుమ పథకం మాత్రమే పనిచేసిందని అంచనా వేశారు. ఒకవేళ ఎన్నికలు మరో వారం రోజులు ఆలస్యం అయి ఉంటే, టీడీపీ పని అయిపోయేదన్నారు.

ఉచిత పథకాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గోసె పెట్టడం కాదని, గోసె ఎలా పెట్టుకోవాలో నేర్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పథకాల మీద తాను చంద్రబాబుకు కూడా చెప్పానని జేసీ తెలిపారు. ఈవీఎంల మీద తనకు ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి, వాటిపై తానేమీ కామెంట్స్ చేయబోనని స్పష్టం చేశారు.