హైదరాబాద్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు.
నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 154 లారీలను ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. వాటికి సంబంధించిన నకిలీ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి.