ఏపీలో బలపడుతున్న బీజేపీ.. చంద్రబాబు పాత్రపై జేసీ సంచలన వ్యాఖ్యలు

11:52 am, Sat, 14 September 19

అనంతపురం: వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు అటువంటి వ్యాఖ్యలే చేసి కాకరేపారు. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైందని అన్నారు.

అక్కడితో ఊరుకోకుండా దీనికి వెనుక మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరోక్ష పాత్ర ఎంతోకొంత ఉందని బాంబు పేల్చారు. చంద్రబాబు ఆలోచనలపైనే ఏపీలో బీజేపీ ఆధారపడి ఉందని తేల్చి చెప్పారు.

ప్రధాని మోడీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలు ఆధారపడి ఉన్నాయన్నారు. జమిలి ఎన్నికలపైనా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు గండం పొంచి ఉందన్నారు.

ఈ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని జేసీ ఆందోళన వ్యక్తం చేశారు.