కరోనా వైరస్: నా వంతు సేవలు వాడుకోండి.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏ పాల్ ఆఫర్!

12:09 pm, Tue, 17 March 20
KA Paul Tweet on Coronavirus

అమరావతి: చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) భారత్‌లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ స్పందించారు. కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయం చేస్తానంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

చదవండి: చైనాకు మరో ఎదురుదెబ్బ.. కూలిన ‘కరోనా’ హోటల్.. శిథిలాల నుంచి 34 మంది వెలికి తీత

కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వ్యక్తులకు చికిత్స అందించేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఆసుపత్రులను, వైద్య కళాశాలలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు.

‘‘నా వంతు సాయం అందుకోండి..’’

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహాయం చేస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రకటించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైస్ జగన్‌ల‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

చదవండి: చైనాలో సంచలనం.. కరోనా వైరస్ నుంచి బయటపడిన వందేళ్ల వృద్ధుడు

‘‘దేశంలో కరోనా వైరస్‌ క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌ బాధితులకు వైద్య సదుపాయం కల్పించే విషయంలో అవసరమైతే సంగారెడ్డిలో మాకున్న 300 పడకల గదులు, అలాగే విశాఖపట్నంలో ఉన్న 100 పడగల గదుల చారిటీ సిటీస్‌‌ను ఉపయోగించుకోండి, ఇందుకు మాకేమీ డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు..’’ అని ఆ ట్వీట్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు.