వివేకా హత్య ఇంటిదొంగల పనే: కీలక నిందితుడు పరమేశ్వర్ వెల్లడి…

2:25 pm, Mon, 18 March 19
key-accused-of-vivekananda- reddy-murder-case-parameshwara-reddy

చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించడంతో అతని ఆచూకీ వెలుగులోకి వచ్చింది.

పరమేశ్వర్‌ది కడప జిల్లా సింహాద్రిపురం. అనారోగ్యంతో కడప సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వివేకానందరెడ్డి హత్యకు గురైనట్లు తనకు తెలిసిందని పరమేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపాడు.

సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స అందించే వైద్యుడు వ్యక్తిగత కారణాలతో తాను మూడు రోజులపాటు అందుబాటులో ఉండనని కర్నూలుకు వెళ్లాల్సిందిగా తనకు సూచించినట్లు పరమేశ్వర్ చెప్పాడు.

అది ఇంటిదొంగల పనే…

వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను కర్నూలు వెళ్లకుండా తిరుపతికి వచ్చినట్లు తెలిపాడు. అయితే, తనకు వివేకానంద రెడ్డి హత్యకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటిదొంగల పనేనని అన్నారు.

పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేస్తున్నారని పరమేశ్వర్ ఆరోపించారు. మంచం దిగే పరిస్థితిలేని తన భర్తపై హత్యారోపణలు చేయడం సరికాదని పరమేశ్వర్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వారిని పట్టుకోకుండా.. తమకు చెడ్డపేరు తేవడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

వివేకానందరెడ్డి కుటుంబంతో తనకు 20 ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని పరమేశ్వర్ తెలిపాడు. తాను ప్రాణాలిచ్చే వాడినేగానీ.. ప్రాణాలు తీసేవాడిని కాదని అన్నారు. ఇది ఇలావుంటే, పరమేశ్వర్ తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి.. సిట్ బృందం అక్కడికి బయల్దేరింది.