వైసీపీ, జనసేన.. స్వతంత్ర అభ్యర్థిగానా? ‘కొత్తపల్లి’ పయనమెటు?

1:05 pm, Sun, 24 March 19
kothapalli-subbarayudu

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పినున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారా? లేక జనసేన బాట పడతారా? అన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో వైఎస్సార్సీపీలో ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ మధ్య టీడీపీలో చేరారు. అనంతరం టీడీపీ అధిష్ఠానం ఆయన్ని కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా నియమించింది. ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించిన ఆయన.. టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా కూడా చేశారు.

అయినా టిక్కెట్ కేటాయింపులో పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సూచనా అందకపోవడంతో చివరికి కొత్తపల్లి తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం. అంతేకాదు, ఆయనతో జనసేన నాయకులు కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ?

ఒకవేళ ఇటు వైఎస్సార్సీపీగాని, అటు జనసేనగాని ఆశించిన స్థాయిలో స్పందించకపోతే.. వచ్చే ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన కూడా సుబ్బారాయుడు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల ఆయన తన ముఖ్య అనుచరులతో కూడా సమావేశమై వారి అభిప్రాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

టీడీపీకి గుడ్ బై పక్కా…

అనంతరం ఆయన కొత్తపల్లి సుబ్బారాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తాను టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు. ఆ మర్నాడే అంటే 25వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా వేయనున్నట్లు చెప్పారు.

అయితే ఆయన వైఎస్సీర్సీపీలో చేరే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సోమవారం వైఎస్ జగన్‌ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెబుతున్నారు.