జగన్‌తో ‘కొత్తపల్లి’ సుదీర్ఘ భేటీ, వైఎస్సార్సీపీలో చేరికకే మొగ్గు!

5:02 pm, Sun, 24 March 19
kothapalli-subbarayudu-meets-ys-jagan

హైదరాబాద్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్సీపీలో చేరికకే మొగ్గు చూపిస్తున్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ నివాసంలో కలిశారు.

సుబ్బారాయుడిని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వెంటబెట్టుకొచ్చారు. జగన్‌తో జరిగిన సుదీర్ఘ భేటీలో .. జిల్లాలో పరిస్థితులతోపాటు తన రాజకీయ భవిష్యత్తు, ఇంకా పలు అంశాలపై కొత్తపల్లి చర్చించారు.

అనంతరం బయటికి వచ్చిన సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో పలు విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు చెప్పారు. తాము మాట్లాడుకున్న విషయాలను తమ కార్యకర్తలు, నాయకుల దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయం కూడా కనుక్కుంటానని, తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడుకు నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే విషయంలో టీడీపీ అధిష్ఠానం చివరి వరకు నాన్చి ఆ తరువాత చేయిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొత్తపల్లి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవితోపాటు, టీడీపీకి కూడా రాజీనామా సమర్పించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు తనతో వైఎస్సార్సీపీ, జనసేన నేతలు టచ్‌లోనే ఉన్నారని, ఏ పార్టీలో చేరిది, తన రాజకీయ భవితవ్యం ఏమిటన్నది త్వరలోనే ప్రకటిస్తానని సుబ్బారాయుడు తన సన్నిహితుల దగ్గర కూడా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. వైఎస్సార్సీపీలో చేరికకే కొత్తపల్లి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన చేరిక లాంఛన ప్రాయమేనని అంటున్నారు.