ఎన్టీఆర్ మరణం: ఇదీ ఆనాడు జరిగింది, ఎవరీ డాక్టర్ కుసుమ?: లక్ష్మీపార్వతి ఫైర్..

2:00 pm, Sat, 6 April 19
dr-kusuma-rao--vs-lakshmi-parvathi

హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ మరణంపై ఆయన భార్య బసవతారకం స్నేహితురాలైన డాక్టర్ కుసుమ రావు ఇటీవల సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ది సహజ మరణం కాదంటూ డాక్టర్ కుసుమ ఎన్నో విషయాలు బయటపెట్టారు. అయితే వైఎస్సార్సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తాజాగా ఈ విషయాలపై స్పందించారు.

‘‘ఎవరీ డాక్టర్ కుసుమ రావు? ఆనాడు ఆమె ఉందా? చూసిందా? ఒకవేళ ఎన్టీఆర్ మరణంపై ఆమెకేమైనా సందేహాలు ఉంటే నిమ్స్‌కెళ్లి రికార్డులు చెక్ చేసుకోమని చెప్పండి, తెలిసీ తెలియకుండా మాట్లాడటం సరికాదు..’’ అంటూ లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు.

చదవండి: మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ఇచ్చారు: ఎన్టీఆర్ మరణంపై డాక్టర్ సంచలనం

ఎన్టీఆర్ మరణించి ఏళ్లు గడిచినా.. ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎన్నికలప్పుడో, లేదా మరేదైనా సందర్భంలోనో ఆయన మరణంపై కొత్త కొత్త విషయాలు బయటికి రావడం, వాటిపైన చర్చ జరగడం పరిపాటిగా మారింది.

ఎన్టీఆర్ మరణానికి ప్రధానంగా ఆయన అల్లుడు, ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పోడవడమేనని, ఆ మానసిక క్షోభోనే ఎన్టీఆర్ చనిపోయారని కొంతమంది ఆరోపణ.

కాదు, ఎన్టీఆర్ ద్వారా ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి సంతానం పొందాలని చూశారని.. ఈ క్రమంలో ఆయనకు హార్మోన్ల కోసం స్టెరాయిడ్స్ వాడటం వల్లనే ఆయన మరణించారనేది మరికొందరి వాదన.

ఈ విషయమై నేటికి అప్పుడప్పుడూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సన్నిహితురాలైన డాక్టర్ కుసుమా రావు ఎన్టీఆర్ మరణం, చంద్రబాబు వెన్నుపోటులపై ఇటీవల చేసిన వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూలో డాక్టర్ కుసుమా రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణం, చంద్రబాబు వెన్నుపోటు తదితర అంశాలపై సంచలన విషయాలను బయటపెట్టారు. ఎన్టీఆర్‌ది సహజ మరణం కాదని వ్యాఖ్యానించడమే కాకుండా పలు అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు.

అప్పట్లో పార్టీలో, ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి పెత్తనం సాగేదని.. ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే చంద్రబాబుని కూడా పార్టీకి దూరం చేయాలని ఆమె చూశారని తెలిపారు.

లక్ష్మీపార్వతి సూచనల మేరకు చంద్రబాబుని మంత్రి పదవి నుంచేకాక, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పించారని.. అసలు వెన్నుపోటుకు గురైంది ఎన్టీఆర్ కాదని, చంద్రబాబే అంటూ డాక్టర్ కుసుమ రావు వ్యాఖ్యానించారు. ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఎవరీ డాక్టర్ కుసుమ రావు?: లక్ష్మీపార్వతి

దీంతో ఎన్టీఆర్ రెండో భార్య, ప్రస్తుత వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. ‘23 ఏళ్లుగా ఇలాంటివి వినీ వినీ తాను అలిసిపోయానని, వాటిపై స్పందించాల్సిన అవసరమే లేదని ఆమె పేర్కొన్నారు.

అసలు ఆ సమయంలో తమతో లేని, ఆనాటి పరిస్థితికి సంబంధం లేని వ్యక్తి ఇన్నేళ్ల తరువాత ఇలా కామెంట్స్‌ చేస్తున్నారని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తరువాత ఎన్నడూ ఈ డాక్టర్ కుసుమ రావును చూడనే లేదని చెప్పారు.

‘‘ఆనాడు ఇదీ జరిగింది…’’

‘‘అప్పట్లో కాకర్ల సుబ్బారావుగారు నిమ్స్ చైర్మన్‌గా ఉన్నారు. ఎన్టీఆర్‌కి పెరాలసిస్ స్ట్రోక్ వస్తే హాస్పటల్‌లో జాయిన్ చేశాం. ఇప్పటికీ అక్కడ దీనికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. కావాలంటే డాక్టర్ కుసుమ రావు వెళ్లి చూసుకోవచ్చు..’’ అని లక్ష్మీపార్వతి తెలిపారు.

అంతేకాదు, ఎన్టీఆర్ మరణం అందరికీ సంబంధించిన ఓపెన్ సీక్రెట్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆ రోజున అక్కడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందని, దీంతో బెంగళూరు నుండి గౌరీదేవి అనే స్పెషలిస్ట్‌ని పిలిపించారని లక్ష్మీపార్వతి వివరించారు.

‘‘బ్రెయిన్ క్లాట్ అయ్యింది… ఆయనపై అస్సలు ఒత్తిడి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ చెప్పారు. కానీ వీళ్లంతా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఇదీ జరిగిన వాస్తవం..’’ అంటూ పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి.