కడప జిల్లాలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ ప్రదర్శన.. ఈసీ సీరియస్! జేసీపై చర్యలకు సిఫార్సు…

3:55 pm, Fri, 3 May 19
JC Latest News, Lakshmi's NTR Latest News, Ram Gopal Varma , Newsxpressonline

కడప: లక్ష్మీస్ ఎన్టీఆర్ గత కొన్ని రోజులుగా మారుమోగిపోతున్న సినిమా పేరు. వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల అయిన ప్రతి చోట భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఒక్క ఏపీలో రిలీజ్ కాలేదు.

ఈ సినిమా చాలామంది జీవితాలని తారుమారు చేసింది. ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా జాయింట్ కలెక్టర్ పైనే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ పడింది.

తొలుత ఆర్జీవి వర్సెస్ టీడీపీగా ఉన్న ఈ సినిమా వ్యవహారం ఆ తరువాత టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. ఎన్నికల సంఘం ఏపీలో సినిమా ప్రదర్శనక ససేమిరా అంది. అయినా.. ఏపీలోని ఒక జిల్లాలో సినిమాను ప్రదర్శించారు. దీని పైన ఎన్నికల సంఘం సీరియస్ అవ్వటంతో ఏకంగా ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ పైనే చర్యలకు రంగం సిద్దమైంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పైన తొలి నుండి వివాదం నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి ట్రయిలర్ విడుదల సందర్భంలోనే చంద్రబాబును కించపరిచేలా పాట చిత్రీకరించారంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత కూడా సినిమా కాంట్రవర్సీగా మారింది. సినిమాను ఎన్నికల సమయంలో ఏపీలో విడుదల చేయవద్దంటూ కోర్టు కెక్కారు.

చదవండి: వర్మ ఒక సైకో! యామిని సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి బయోపిక్‌లు కోడ్ ముగిసే వరకూ ప్రదర్శించవద్దని ఆదేశించింది. దీంతో..సినిమా తెలంగాణ వరకు విడుదల అయింది. ఈ నెల 1న ఏపీలోనూ సినిమా ప్రదర్శను ఆర్జీవీ అనుమతి కోరినా, ఎన్నికల సంఘం ససేమిరా అంది. దీంతో.. సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే ఏపీలోని కడప జిల్లాలో సినిమా రెండు ఆటలను ప్రదర్శించినట్లు ఫిర్యాదు రావటంతో ఎన్నికల ప్రధానాధికారి చర్యల దిశగా నిర్ణయం తీసుకున్నారు.  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీలో ఎక్కడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనకు అనుమతి లేదు.

అయితే, కడప జిల్లాలో మాత్రం ఆ సినిమాను ప్రదర్శించారు. దీని పైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు వచ్చాయి. దీని గురించి విచారణ చేసిన సీఈవో సినిమా ప్రదర్శన నిజమేనని తేలటంతో చర్యలకు నిర్ణయించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సినిమా ప్రదర్శన నియంత్రణలో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ విఫలమయ్యారని, ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈఓ ద్వివేదీ సిఫార్సు చేసారు.

ఇప్పటికే రాజకీయంగా వేడి పుట్టించిన ఈ సినిమా వ్యవహారంలో ఇప్పుడు ఎన్నికల సంఘం సైతం సీరియస్‌గా స్పందించింది. ఫలితంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పైన చర్యలకు రంగం సిద్దమైంది. నేడో రేపో కడప జాయింట్ కలెక్టర్ పైన ఎన్నికల సంఘం క్రమశిక్షణా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
చదవండి: నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వాటిపై సినిమా తియ్: వర్మకు దివ్యవాణి సవాల్