టిక్కెట్ ఇవ్వకున్నా నంద్యాలలో పోటీ: భూమా బ్రహ్మానందరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

5:01 pm, Sat, 16 March 19
Make an Independent from Nandyal! Bhuma Brahmananda Reddy's Interesting Comments!, Newsxpressonline

కర్నూల్: ఏపీ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతో ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. కొందరు సీట్ల విషయంలో అధిష్టానంపై అలక చూపిస్తే, మరికొందరు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నంద్యాల రాజకీయం ఆసక్తిగా మారింది.

126 మంది టీడీపీ అధిష్ఠానం తొలిజాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిల ప్రియను ఖరారు చేయగా, నంద్యాలలో ఎవరూ పోటీ చేస్తారో ప్రకటించలేదు. అయితే రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని టికెట్ తనదేనని.. భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ సీటు మాదే: అఖిల ప్రియ

కాగా, ఇప్పటికే నంద్యాల సీటు తమదేనని అఖిలప్రియ మాట్లాడుతూ కచ్చితంగా చెప్పిన విషయం విదితమే. మరోవైపు నంద్యాలలో కార్యకర్తలతో బ్రహ్మానందరెడ్డి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నంద్యాల టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్నారు.

అంతేకాదు, ఒకవేళ తనకు టికెట్‌ దక్కకున్నా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, దివంగత నేత భూమా నాగిరెడ్డి ఫొటోలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పారు.

తీవ్రమైన పోటీ…

ఇదిలా ఉంటే ఈసారి నంద్యాల టికెట్ తనకివ్వాలని ఏవీ సుబ్బారెడ్డి. తన అల్లుడికే నంద్యాల టికెట్ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి అధిష్ఠానాన్ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండో జాబితాలో నంద్యాల పేరు ఉంటుందా..? ఉంటే అభ్యర్థి ఎవరు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.