తారక్ వస్తే నా ప్రాణం పెడతా: జనసేనకే మద్దతంటూ మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

6:05 pm, Sat, 23 March 19
Manchu manoj interesting comments on Jr NTR News, Jr NTR Latest News, Newsxpressonline

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనో‌జ్‌లు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, వారు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా, మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై చంద్రబాబు సర్కారు, టీడీపీపై మోహన్ బాబు ఇటీవల ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేత కుటుంబరావు కూడా మోహన్ బాబు కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. అది మంచు ఫ్యామిలీ కాదు ముంచే ఫ్యామిలీ అంటూ ఘాటుగా స్పందించారు.

జనసేనకు మద్దతు.. తారక్ కోసం ప్రాణం పెడతా..

ఈ నేపథ్యంలో కుటుంబరావు వ్యాఖ్యలకు మంచు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. పలు ప్రశ్నలు సంధిస్తూనే శ్రీ విద్యానికేతన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల లెక్కలను ట్విట్టర్ వేదికగా ప్రజల ముందు ఉంచారు. దీంతో మనోజ్ ట్వీట్లకు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొందరు మాత్రం మనోజ్, మోహన్ బాబుకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.

కాగా, ఈ సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా జనసేనకే మద్దతు తెలియజేస్తానని.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మనోజ్ చెప్పడం గమనార్హం. దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. ‘అన్న చిన్న డౌట్.. ఇప్పుడు ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేయన్న, అది నీ ఇష్టం. కానీ, ఓ 5/10 సంవత్సరాల తర్వాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే ఆయనకు తోడుగా ఉంటావా? అన్న’ అని ప్రశ్నించాడు.

దీనికి మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘తారక్(జూ. ఎన్టీఆర్) వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డు’ అని మనోజ్ వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా స్పందిస్తున్నారు.